చిత్రం: కొరియన్ కనకరాజు
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
కథ – రచన: మేర్లపాక గాంధీ
నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయర్, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్, తులసి, వీటీవీ గణేష్, అవసరాల శ్రీనివాస్ తదితరలు
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
సంగీతం: తమన్ ఎస్.ఎస్
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
ఎడిటర్: సత్య జి
బ్యానర్: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ: 7 ఆగస్ట్ 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2.75/5
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంత కాలంగా వరస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని హారర్ కామెడీ జోనర్ లో “కొరియన్ కనకరాజు” తో వచ్చాడు.మేర్లపాక మురళి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాకా మరింత హైపు నెలకొంది. ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజైన కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉంది ? వరుణ్ ఈ సారి హిట్ కొట్టాడా ? హారర్ కామెడీ తో ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించాడు అన్నది ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
కొరియాలో ఓ గ్యాంగ్ స్టార్ చనిపోతాడు. అతని అస్థికలు ఓ సీసాలో భద్రపరుస్తారు. ఆ సీసా చేతులు మారుతూ పెనుగొండకు వస్తుంది. కనకరాజు (వరుణ్ తేజ్) పెనుగొండలో ఓ చెక్క భజన బృందం నడుపుతుంటాడు. కనకరాజు ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ కృష్ణప్ప (సత్య) . కృష్ణప్ప ఫొటో స్టూడియిలోనే భజన బృందం కొనసాగుతుంది. ఊళ్ళో ఉన్న చెంగారెడ్డి(సునీల్) తో కనకరాజుకు గొడవలు ఉంటాయి. ఇంకో వైపు పెనుగొండ కియా కంపెనీలో పనిచేసే చైత్ర(రితిక నాయక్)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు కనకరాజు. చైత్ర ఎప్పటికైనా కొరియన్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంది. పెనుగొండ కియా కంపెనీలో చాలా మంది కొరియన్స్ ఉంటారు. ఓ రోజు కనకరాజు చెంగారెడ్డి మనుషులతో గొడవపడుతూ ఆత్మ ఉన్న సీసా మూత తీసి అందులో మందు పోసుకొని తాగుతాడు. దాంతో ఆ కొరియా ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ కనకరాజులోకి వచ్చాకా ఎలా మారతాడు? చైత్ర, ఆ ఆత్మ, కనకరాజు, సత్య కొరియాకు ఎందుకు? ఎలా వెళ్తారు? అసలు ఆ కొరియన్ ఆత్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? కొరియాకు వెళ్ళాక కనకరాజు & కో ఎదుర్కొన్న పరిస్థితులేంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
కొరియన్ సినిమాలకి ఇండియాలో ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే ఇప్పుడు కొరియన్ కనకరాజు లో దర్శకుడు కొరియన్ ఆత్మతో క్రేజీ కథ అల్లుకున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాములు హార్రర్ స్టోరీకి కొరియాతో ముడి పెట్టి అనంతపురానికి కనెక్ట్ చేసాడు. కథ, కథనం కన్విన్సింగ్‌గా ఉంది. కొరియాలో ఉండే ఓ గ్యాంగ్ స్టర్ అస్థికలు ఏపీలోని అనంతపురానికి ఎందుకు వచ్చాయనే విషయంలో లాజిక్ కరక్ట్ గా ఉంది. సాధారణంగా దెయ్యాలు, ఆత్మలు బ్యాక్ గ్రౌండ్ కథలన్నీ ఓ వ్యక్తి చనిపోయాకా తీరని కోరికలు లేదా ప్రతీకారం లాంటి ఆలోచనలతో ఆ ఆత్మ మరొ వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొరియన్ కనకరాజులో కూడా ఆత్మ ఈ విధంగానే చేరుతుంది. ఈ మధ్య హార్రర్ కామెడీ ఫార్ములాను ఎక్కువగా నమ్ముతున్నారు మన దర్శకులు. ఇప్పుడు మేర్లపాక మురళి కూడా ఇదే ఫార్ములాని ఎంచుకున్నాడు. అందరూ ఇదే జోనర్ ని ఎంచుకున్నా కథని లాజిక్ మిస్ అవకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పాడనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ మూవీలో కొరియన్ ఆత్మని తెచ్చి, దానికి తగినంత వినోదంతో పాటు యాక్షన్‌ను కూడా యాడ్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. చిన్న చిన్న లాజిక్స్ ఈ సినిమాలో కూడా మిస్ అయ్యాయి. అసలు చదువేలేని కనకరాజు కొరియాకు వెళ్ళటం, క్షుద్ర పూజలు లాంటివి కొంచెం లాజిక్ లేకుండా ఉన్నాయి. కానీ కామెడీ టైమింగ్ బాగా కుదిరింది.
క్షుద్ర పూజ సీన్ లో సత్యతో పాటు మురళీధర్ గౌడ్ కామెడీ ట్రాక్ బాగుంది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది ఈ సీన్. వరుణ్ తేజ్ కూడా రెండు భిన్నమైన పాత్రల్లో నటించి ఫుల్ మార్క్ కొట్టేసాడు. క్లైమాక్స్‌లో రెండు ఆత్మల మధ్య వచ్చే ఫైట్ సీన్లు అంతగా ఆకట్టుకోలేదు. కార్టూన్ నెట్ వర్క్ లా ఉంది. గ్యాంగ్ స్టర్ ఆత్మ అంతం అయ్యి, చనిపోయిన హీరో మళ్లీ బతకడం లాంటి సీన్స్‌తో దైవ బలం గొప్పదనే మెసేజ్ ఇచ్చాడు దర్శకుడు. బుల్లిరాజు, వీటీవీ గణేష్ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తాయి. నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రమోషన్స్ లో టీమ్ చెప్తూ వచ్చింది. సినిమా చూస్తే అదే అనిపిస్తుంది. దర్శకుడుకి కామెడీ జోనర్ లో మంచి పట్టు ఉందని ఇంకోసారి నిరూపించాడు. మామూలు కథనే ఇండో – కొరియన్ నేపథ్యంతో యాక్షన్, హారర్ కామెడీ తరహాలో మలచి కొత్తదనాన్నితీసుకొచ్చారు. గ్యాంగ్‌స్టర్స్ కథ కావడంతో మాస్ మెచ్చే అంశాలూ ఉన్నాయి. ఆత్మ కనకరాజులో ప్రవేశించిన తరువాత కామెడీతో ఆడియన్స్ ని మెప్పించారు. లాజిక్కులు వెతుక్కోకుండా సరదాగా చూసి నవ్వుకోవచ్చు.
నటీ నటులు:
రెండు కోణాల్లో కనకరాజు పాత్రతో వరుణ్‌తేజ్‌మ్యాజిక్ చేసాడు. వరుణ్ తేజ్ లో ఉన్న షార్ప్ నెస్ ని ఈ సినిమాలో చూస్తారు. వరుణ్ లుక్ కూడా కొత్తగా ఉంది. వరుణ్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. సత్య, వరుణ్ మధ్య కెమిస్ట్రీ పండింది. సత్య ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. సత్య పంచ్‌లు, ఫేస్ ఎక్సప్రెషన్స్ చాలా నవ్విస్తాయి. హీరోలని ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. చెంగారెడ్డి పాత్రలో సునీల్ విలనిజం బాగుంది. ఇప్పటికే సునీల్ ని ఇలాంటి పాత్రలో చూసారు ఆడియన్స్. చైత్ర గా నటించిన రితికా నాయర్ కూడా ఈ సినిమాలో ఆకట్టుకుంది. దాదాపు ప్రతి ఫ్రేమ్ లోను రితికా కనిపిస్తుంది. దక్ష నగార్కర్ ఐటెం సాంగ్ లో మెరిసింది. మిగతా నటీ నటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్:
దర్శకుడు మేర్లపాక మురళి తనకు కలిసొచ్చిన జోనర్ తో ఇంకోసారి హిట్ కొట్టాడు. థియేటర్స్ లో రెండుగంటలపాటు ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యం నెరవేరింది. తమన్ అందించిన సంగీతం సినిమాకి ఇంకో ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత బలాన్నిచ్చింది. మనోజ్‌రెడ్డి విజువల్స్ ఆకట్టుకున్నాయి. కెమెరా వర్క్ చాలా స్టైలీష్‌గా ఉంది. విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు. నిర్మాణవిలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
వరుణ్ తేజ్
కామెడీ
సత్య
తమన్ సంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత
లాజిక్ లేని సీన్స్
ఫైనల్ వర్దిక్ట్ : లాజిక్ లేని మ్యాజిక్ “కొరియన్ కనకరాజు”





