HomeMovie News Teluguకొరియన్ కనకరాజు పై వివాదం.. ఆ సీన్ తొలగించాలంటూ డిమాండ్!

కొరియన్ కనకరాజు పై వివాదం.. ఆ సీన్ తొలగించాలంటూ డిమాండ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన తొలి షో నుంచే వరుణ్ తేజ్ నటన, డిఫరెంట్ మేకోవర్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కమెడియన్ సత్య, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించారు.

ముఖ్యంగా సెకండాఫ్‌లో సత్య, మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అయితే సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది.

సమాచారం ప్రకారం, సినిమాలోని ఒక ఫైట్ సీన్‌లో 1978లో విడుదలైన ‘యుగపురుషుడు’ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ప్రసిద్ధ డైలాగ్ “మీ షాట్ చాలా అమెచ్యూరిష్‌గా ఉంది” ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ డైలాగ్‌ను కామెడీ సన్నివేశంలో వినియోగించడంపై కొందరు నందమూరి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్‌కు చెందిన ఐకానిక్ డైలాగ్‌ను సాధారణ కామెడీ కోసం ఉపయోగించడం సరైంది కాదని సోషల్ మీడియాలో పలువురు అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ సన్నివేశం ఆయన వారసత్వాన్ని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, వివాదానికి కారణమైన ఆ సన్నివేశాన్ని వెంటనే సినిమా నుంచి తొలగించాలని కొందరు నందమూరి అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.అయితే ఈ వివాదంపై ‘కొరియన్ కనకరాజు’ చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ అంశంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular