కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న తొలి చిత్రం ‘జన నాయగన్’. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ముఖ్యంగా తమిళనాడులో అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఈ నేపథ్యంలో జన నాయగన్ తొలి రోజు ఎంత మేర వసూళ్లు సాధిస్తుందనే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ కెరీర్లో అత్యధిక తొలి రోజు కలెక్షన్ల రికార్డును ఈ సినిమా బద్దలు కొడుతుందా అనే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం విజయ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో పేరుపై ఉంది. ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.146.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఆ తర్వాత విడుదలైన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) మాత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.104.75 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టి, లియో రికార్డును అందుకోలేకపోయింది.
ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత విజయ్ నటించిన తొలి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లియో తొలి రోజు వసూళ్ల రికార్డును అధిగమించి విజయ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదలై తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టి మొత్తం జన నాయగన్ తొలి రోజు కలెక్షన్లపైనే ఉంది.





