పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందం థియేట్రికల్ పంపిణీకి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా స్పిరిట్ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రముఖ పంపిణీ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద స్టార్‌లలో ఒకరైన ప్రభాస్‌కు కర్ణాటక ప్రేక్షకులు ఎప్పుడూ విశేష ఆదరణ చూపిస్తున్నారని తెలిపారు. ఈసారి అదే అభిమానంతో కర్ణాటక బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
భారతీయ సినీ పరిశ్రమలో కర్ణాటక అత్యంత బలమైన మార్కెట్లలో ఒకటిగా ఉండటంతో, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ భాగస్వామ్యంతో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభవాన్ని అందించడమే కాకుండా, కర్ణాటక బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పాలని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేసిన ఈ అధికారిక ప్రకటనతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. స్పిరిట్ కర్ణాటకలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.






