భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్ ముగింపుకు చేరువైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.
39 ఏళ్ల రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నప్పటికీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు బ్లూ జెర్సీలో చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు బీసీసీఐ లేదా రోహిత్ శర్మ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రోహిత్ శర్మ ఇప్పటికే 2024 టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు, 2025లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకవేళ వన్డేల నుంచి కూడా తప్పుకుంటే ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలికినట్టే అవుతుంది.
రోహిత్ నాయకత్వంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఆయన బ్యాటింగ్ ఫామ్ తగ్గడం, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన ప్రదర్శన చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
రోహిత్ శర్మ తన భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను సెలెక్టర్లు ఆయనకే వదిలినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో లార్డ్స్ వన్డే ముగిసిన అనంతరం ‘హిట్‌మ్యాన్’ తన అంతర్జాతీయ భవిష్యత్తుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది.





