HomeMovie News Teluguరావు బహదూర్ చూడాల్సిందే.. సందీప్ వంగా

రావు బహదూర్ చూడాల్సిందే.. సందీప్ వంగా

నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకలాజికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, సినీ ప్రముఖుల నుంచి మాత్రం విశేష ప్రశంసలు అందుకుంటోంది.

ఇప్పటికే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్, హీరోలు నాగచైతన్య, నిఖిల్ సిద్ధార్థ్ తదితరులు మెచ్చుకోగా, తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన సందీప్ రెడ్డి వంగా, ‘రావు బహదూర్’ ఒక అరుదైన సినిమాటిక్ అనుభూతిని అందించే చిత్రమని పేర్కొన్నారు. ‘మనం సినిమాలను ఎందుకు ప్రేమించామో మరోసారి గుర్తుచేసే గొప్ప చిత్రాల్లో ఇది ఒకటి. సినిమాను నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మూడు గంటల సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించాలి. మీ శ్రద్ధకు, ఓపికకు, చప్పట్లకు ఈ సినిమా పూర్తిగా అర్హమైనది’ అంటూ ప్రేక్షకులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.

పరిమిత బడ్జెట్, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ దర్శకుడు వెంకటేష్ మహా అత్యంత నిబద్ధతతో, ఖచ్చితత్వంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆయన కొనియాడారు. ఇలాంటి విభిన్నమైన సినిమాను రూపొందించాలంటే ఎంతో ధైర్యం, బలమైన నమ్మకం అవసరమని పేర్కొన్నారు.

హీరో సత్యదేవ్ నటనపై కూడా సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు. ఎలాంటి హడావుడి, షార్ట్‌కట్‌లు లేకుండా స్వచ్ఛమైన ఫిల్మ్‌మేకింగ్‌తో సినిమా రూపొందిందని, కల్తీ లేని కథను రాజీపడకుండా తెరపై ఆవిష్కరించిన చిత్ర బృందాన్ని అభినందించారు.

చివరగా ‘రావు బహదూర్’ చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని సందీప్ రెడ్డి వంగా కోరారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular