టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైలురాయి చిత్రం ‘కింగ్-100’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంలో టబు, ఉపేంద్ర, సుస్మితా భట్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగార్జున-టబు జోడీ గతంలో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించడంతో, ఈ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో టబు పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగార్జునకు ఎదురుగా లేడీ విలన్‌గా ఆమె పాత్ర ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అలాగే ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందుతుండగా, తండ్రి-కూతురు మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని, దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.





