తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కథనం, భావోద్వేగాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ పెట్ల. ఆయన తెరకెక్కించిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ విజయాన్ని అందుకోగా, ఇటీవల విజయ్ దేవరకొండతో రూపొందించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.
ఆ సినిమా తర్వాత పరశురామ్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పరశురామ్ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కథా చర్చలు కొనసాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ నిజమైతే, పరశురామ్ కెరీర్‌లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే, హృతిక్ రోషన్ – పరశురామ్ కాంబినేషన్‌పై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే కావడంతో, దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





