విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత (86) వృద్ధాప్య సమస్యలతో సోమవారం ఉదయం ఇంటిలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయం కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
సాయంత్రం బెంగళూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో మరియు అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
గతంలో ఒక అంతర్జాతీయ డిమెన్షియా సదస్సులో మాట్లాడిన ప్రకాశ్ రాజ్, తన తల్లికి మెదడులో చిన్న కణితి కారణంగా శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో ఆమె కొద్ది రోజుల పాటు జ్ఞాపకశక్తి కోల్పోయినప్పటికీ, తర్వాత కోలుకున్నారని వెల్లడించారు.
ప్రకాశ్ రాజ్ విషయానికొస్తే.. హీరో, విలన్, తండ్రి, సోదరుడు వంటి విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తన అద్భుతమైన నటనతో ఆయన భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రకాశ్ రాజ్ కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు సానుభూతి తెలియజేస్తున్నారు.





