ప్రస్తుతం మనం సోషల్ మీడియాలోనే ఎక్కువ బతుకుతున్నాం. ఎక్కడ ఎవరు ఏం మాట్లాడతారా? దాన్ని ఏవిధంగా కాంట్రవర్సీ చేద్దామా అని కొందరు పనిగట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. వారణాసి మూవీ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన మాటల్ని అలానే రచ్చ చేసి కావల్సినంత నెగిటివిటీ అంటగట్టారు. తాజాగా మారుతి వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. ఆదివారం ‘ది రాజా సాబ్’ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ ఫాన్స్ ని నొప్పించాయి.
ఇంతకీ ఏమయ్యిందంటే మారుతీ ప్రభాస్ ని ఉద్దేశించి మాట్లాడుతూ “నేను కాలర్ ఎగరేసుకోమని చెప్పను. ప్రభాస్ కటౌట్ కు అది చాలా చిన్న మాట” అన్నాడు. దీంతో మారుతి ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసాడని ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. కారణం ఎన్టీఆర్ దేవర, వార్ 2 సినిమాల రిలీజ్ సంధర్భంగా “కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తా” అని చెప్పటమే. ఇంకేముంది సోషల్ మీడియా వేదికగా మారుతిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
తప్పు తెలుసుకున్న మారుతి, ట్విట్టర్ అకౌంట్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని జనరల్ గా ప్రభాస్ ని ఉద్దేశించి ఆ మాటలు అన్నా అని, అవి కేవలం ఫ్లోలో వచ్చిన మాటలే కానీ ఉద్దేశపూర్వకంగా అన్నవి కావని’ సంజాయిషీ ఇచ్చారు. చివరికి క్షమాపణ కూడా చెప్పారు. నా మాటలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని స్పందించారు మారుతి.
ఎన్టీఆర్ అంటే తనకు కూడా చాలా గౌరవమని, అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నా తనకు చాలా ఇష్టమని మారుతి ట్వీట్ చేసారు. దయచేసి తన వ్యాఖ్యల్ని వేరేలా అర్థం చేసుకోవద్దని, అస్సలు కంపారిజన్ చేయొద్దని కోరారు. చాలా హుందాగా ఈ వివాదాన్ని ముగించిన మారుతిని పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.





