HomeSports Teluguతెలుగు బిడ్డ శ్రీ చరణికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. రూ.2.5 కోట్ల నగదు, గ్రూప్-1...

తెలుగు బిడ్డ శ్రీ చరణికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. రూ.2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం!

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా టీమిండియాకు గౌరవం తీసుకువచ్చిన తెలుగు అమ్మాయి శ్రీ చరణికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వడంతో పాటు, కడపలో ఇల్లు నిర్మాణం కోసం 1000 చదరపు గజాల స్థలాన్ని కేటాయించనున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు.

శుక్రవారం శ్రీ చరణి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను అభినందిస్తూ, భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ఘన విజయంపై గర్వం వ్యక్తం చేశారు.

చంద్రబాబు మాట్లాడుతూ – “మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం ద్వారా భారత మహిళలు తమ ప్రతిభను మరోసారి నిరూపించారు. శ్రీ చరణి మహిళా క్రీడాకారిణులందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి” అని అన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

తనకు అందుతున్న గౌరవం, మద్దతుకు శ్రీ చరణి ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె తన సహచర మహిళా క్రికెటర్ల సంతకాలతో కూడిన టీ-షర్ట్‌ను సీఎం చంద్రబాబుకు బహుమతిగా అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన సీఎం, జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ముఖ్యమంత్రిని కలిసారు.

ముఖ్యమంత్రిని కలుసుకునే ముందు శ్రీ చరణికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్‌ అనిమిని రవినాయుడు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ఆమె సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

మహిళా క్రికెట్ క్రీడాకారిణులకు ఇలాంటి ప్రోత్సాహక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వాన్ని క్రీడా వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular