నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, మురళీ మోహన్, హర్షాలీ మల్హోత్రా తదితరులు.
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
విడుదల: 2025 డిసెంబరు 12
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2.75/5
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఓ మ్యాజిక్. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన కాంబో ఇది. వీరిద్దరి నుంచి మరో సినిమా వస్తోందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అఖండ 2 హైప్ చూస్తేనే అర్థమైపోతోంది. డిసెంబరు 5న రావాల్సిన సినిమా ఇది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రిలీజ్‌కు ఒక్క రోజు ముందు విడుదల చేసిన టీజర్ మరింత క్రేజీసెస్ పెంచింది. బాలయ్య – బోయపాటి కాంబో డబుల్ హ్యాట్రిక్ కి ఈ సినిమాతో గట్టి పునాది వేయడం ఖాయం అని నందమూరి అభిమానులు గట్టిగా ఆశలు పెట్టుకొన్నారు. మరి ఈ సినిమా ఎలా వుంది? బాలయ్య, బోయపాటి కాంబో ఈసారి ఏమేరకు వర్కవుట్ అయ్యింది?
*కథ
ఇండియాపై ఎలాగైనా పై చేయి సాధించడానికి చైనా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. భారతదేశం బలం.. నమ్మకం అనే పునాదిపై ఉందని, ఆ పునాదిని పెకటించాలని చైనా భావిస్తుంది. అందుకే మహా కుంభమేళాలో లక్షలాది మంది స్నానం చేసే పవిత్ర జలంలో ఒక భయంకరమైన వైరస్ పంపుతుంది. నదీ జలాల్లో స్నానం చేసిన వాళ్లంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. చాలామంది చనిపోతారు కూడా. ఇదంతా చైనా కుట్ర అని తెలుసుకొన్న భారత ప్రభుత్వం వైరస్‌కి విరుగుడుగా ఓ వాక్సిన్ ని కనుకొంటుంది. ఆ వాక్సిన్ ని నాశనం చేయడానికి శత్రువులంతా ఒక్కటవుతారు. ఆ శత్రు మూకని అడ్డుకొని, వాక్సిన్ ని కాపాడేందుకు అఖండ (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు. ఆ తరవాత ఏమైంది? యువ శాస్త్రవేత్త జనని (హర్షాలీ మల్హోత్రా)కీ అఖండకూ ఉన్న సంబంధం ఏమిటి? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
*విశ్లేషణ
కథాపరంగా చూస్తే.. అఖండకూ, అఖండ 2కీ ఎలాంటి సంబంధం లేదు. పాత్రలు, వాటి తీరు తెన్నులు మాత్రం కంటిన్యూ అవుతాయంతే. అఖండలో ఓ కుటుంబాన్ని ఆపద నుంచి గట్టెక్కించడానికి అఖండ వస్తాడు. ఈసారి దేశం ఆపదలో ఉంటుంది. అంతే తేడా. అఖండలో దైవత్వానికి సంబంధించిన అంశాలు, దేవుడి ప్రస్తావన అక్కడక్కడ ఉంటుంది. అఖండ 2లో మాత్రం వాటికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆఖర్లో ఆ పరమ శివుడినే నేల మీదకు దించేశారు. కరోనా వైరస్, ఆ తరవాత జరిగిన పరిణామాలూ మన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇదంతా చైనా కుట్ర అని అప్పట్లో చెప్పకొన్నారు. ఈ కథలో కూడా అలాంటి అంశాలే కనిపిస్తాయి. సనాతన ధర్మాన్ని నాశనం చేసి, దేవుడిపై నమ్మకం పొగొట్టి, భారతీయతపై దెబ్బ కొట్టాలని చూసే శత్రు దేశాన్ని.. అఖండ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే స్థూలంగా కథ. మధ్యమధ్యలో అఖండ చేసే విన్యాసాలు, దైవం గురించి, హింతుత్వం గురించీ, ఈ దేశం గురించి ఇచ్చిన స్పీచులు, బోయపాటి మార్క్ యాక్షన్ ఘట్టాల సమ్మేళనంగా అఖండ సాగింది. అఖండ పాత్రలో బాలయ్య ఎప్పుడు స్క్రీన్ మీదకు వచ్చినా ఎలివేషన్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. నరసింహ స్వామిని, ఆంజనేయుడ్నీ యాక్షన్ ఘట్టాల్లో దించేసిన బోయపాటి అనేక సార్లు గూజ్‌బమ్ మూమెంట్స్ రప్పించాడు.
తొలి 15 నిమిషాల్లోనే కథకు కావల్సిన గ్రౌండ్ సెట్ చేసుకొన్నాడు. అఖండ పాత్ర పరిచయం, ఎం.ఎల్.ఏ బాల మురళీకృష్ణ ఎంట్రీ ఫైట్ ఇవి రెండూ ఫ్యాన్స్ కు నచ్చేస్తాయి. చైనా భారతదేశాన్ని పడగొట్టాలని చూడడం, కుంభమేళా వేదికగా వైరస్ తో దాడి చేయాలని ప్లాన్ చేయడం, ఆ తరవాత అఖండ రావడం ఇవన్నీ కథలో లీనం చేస్తాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయింది. అక్కడ అఖండగా బాలయ్య విన్యాసాలు, చెప్పిన డైలాగులు ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయి. సెకండాఫ్‌లో కథ పట్టు తప్పింది. కథనం మరింత స్లో అయ్యింది. స్పీచులు ఎక్కువయ్యాయి. ఆది పినిశెట్టి క్యారెక్టర్ బలంగా తీర్చిదిద్దినా సరిగా వాడుకోలేకపోయారు. అఖండ నే దైవాంశ సంభూతుడిగా చూపిస్తే… ఇక తిరుగేం ఉంటుంది, ఎదురేం ఉంటుంది? దాంతో సరైన విలనిజం లేక సీన్లు తేలిపోయాయి. క్లైమాక్స్ లో మళ్లీ బోయపాటి మార్క్ యాక్షన్ చూసే అవకాశం దక్కుతుంది. అక్కడ కూడా స్పీచులు ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
*నటీనటులు
బాలయ్య వన్ మాన్ షో ఈ సినిమా. బాలయ్య ద్విపాత్రాభినయం చేసినా… అఖండ పాత్రవైపే దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అఖండ పాత్ర చేయడం బాలయ్యకు మాత్రమే సాధ్యం. సంయుక్త మీనన్ ఒక పాటకూ, కొన్ని సీన్లకే పరిమితం. ఆది పినిశెట్టి బలాన్ని పెద్దగా వాడుకోలేదు. అది మినహా బలమైన విలన్ పాత్ర లేదు. భజరంగీ భాయ్ జాన్ ఫేమ్ హర్షాలీ మల్హోత్రాని రంగంలోకి దింపినా ప్రయోజనం లేకుండా పోయింది. తన మొహంలో భావభావాలు పెద్దగా పలకలేదు.
*సాంకేతిక వర్గం
తమన్ రీ రికార్డింగ్ తో అదరగొట్టేశాడు. కొన్నిసార్లు సౌండ్ మరింత ఎక్కువైంది. పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ కథలో పెద్దగా స్కోప్ కూడా లేదు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. కెమెరా పనితనం ఆకట్టుకొంది. కుంభమేళా సీన్లు తీయడం అంత తేలిక కాదు. బోయపాటిలో యాక్షన్ డైరెక్టర్ ఎక్కువ శ్రమించాడు. రైటర్ గా కూడా కష్టపడితే బాగుండేది. లాజిక్కులు లేని సీన్లు చాలా ఉన్నాయి. ఇది బోయపాటి సినిమా కాబట్టి, లాజిక్కులు ఉండవు అని సరిపెట్టుకోవడమే. 14 రీల్స్ ప్లస్ బాగా ఖర్చు పెట్టింది.
*ప్లస్ పాయింట్స్
బాలయ్య అఖండ అవతారం
యాక్షన్ సీన్స్
సనాతన ధర్మం గురించిన డైలాగులు
*మైనస్ పాయింట్స్
లాజిక్కులు
వైరస్ ఎపిసోడ్
క్లాస్ పీకినట్టు ఉండే సీన్లు
*ఫైనల్ వర్డిక్ట్: బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రమే





