చిత్రం: ఆంధ్రా కింగ్ తాలూకా
దర్శకత్వం: పి. మహేష్
కథ – రచన: పి. మహేష్
నటీనటులు: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, మురళీ శర్మ, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్, రావు రమేష్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, తులసి, రఘుబాబు తదితరులు.
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్
సంగీతం: వివేక్- మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్దార్థ్ నూని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: మైత్రీ మూవీ బ్యానర్
విడుదల తేదీ: 27 నవంబర్ 2025
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 3/5
ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ మధ్య వరుస ప్లాప్స్ లో ఉన్నాడు. చాలా ప్లాఫ్ ల తరవాత బోలెడు ఆశలతో బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరక్టర్ తో స్కంద మూవీ తీసాడు. కానీ ఆశించిన విజయం అందుకోలేక పోయాడు. తరువాత ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో వచ్చాడు. ఇదీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. తన కంటే వెనకవచ్చిన వారంతా పాన్ ఇండియా హిట్స్ కొడుతుంటే రామ్ వెనకపడ్డాడు. అర్జెంట్ గా రామ్ కి హిట్ పడాలి లేదంటే కెరియర్ రిస్క్ లో పడినట్టే అనుకుంటున్న టైం లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఛాన్స్ వచ్చింది. మొదటినుంచి ఈ సినిమాతో హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు రామ్. గురువారం ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి రామ్ హిట్ కొట్టాడా ? కెరియర్ లో మళ్ళీ స్పీడ్ అందుకుంటాడా? ఆంధ్ర కింగ్ తో రామ్ ఫాన్స్ ని , సినీ ప్రియులని ఎంతవరకు మెప్పించాడో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సూర్య (ఉపేంద్ర) ఒక స్టార్ హీరో. కెరియర్ లో చాలా హిట్స్ చూసి నంబర్ వన్ గా ఎదిగిన సూర్య వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సూర్య వందో సినిమా సగం లోనే ఆగిపోతుంది. సినిమాను పూర్తి చేసేందుకు సూర్య రక రకాల ప్రయత్నాలు చేసినా ఫలించవు. అదే టైం లో మీడియాలో కూడా సూర్యకి వ్యతిరేకంగా వార్తలు వస్తాయి. ఎటు చూసినా సమస్యల్లో ఉన్న సూర్యకి ఒక అజ్ఞాత వ్యక్తి సాయం చేస్తాడు. సగం లోనే ఆగిపోయిన సూర్య వందో సినిమాని పూర్తి చేసేందుకు సహాయం చేస్తాడు. తనకి ఇంత సాయం చేసిన ఆ వ్యక్తి ఎవరా అని సూర్య ఆరా తీస్తే తన ఫ్యాన్ సాగర్ (రామ్) అని తెలుస్తుంది. దీంతో సాగర్ ని కలవాలనుకుంటాడు సూర్య. అసలు సాగర్ ఎవరు, సాగర్ కథేంటి, ఒక అభిమాని తన ఫెవరెట్ హీరో కోసం సాయం చేయటం మేంటి? సాగర్ ఉద్దేశ్యం ఏంటి ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లో హీరో గా నటించిన ఉపేంద్ర పేరు సూర్య. ఫ్యాన్ రామ్ పేరు సాగర్. అని పెట్టడంలోనే దర్శుకుడి స్పష్టత తెలుస్తుంది. అందుకే ఒక సీన్ లో సముద్రం -సూర్యుడు కలిసిపోయినట్లు చూపించి ‘సాగర్-సూర్య ఇద్దరూ కలిసిపోయినట్లే ఉంటారు.. కానీ ఎప్పటికీ కలవరు’ అని చెప్పించాడు. అంటే హీరో కి ఫ్యాన్ కి మధ్య ఉన్న అంతరాన్ని దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేసాడు. ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని, తానొక ఫ్యాన్ గా ఆలోచించి దర్శకుడు ఈ కథ రాసుకున్నాడని తెలుస్తోంది. ఫాన్స్ ని రెచ్చగొట్టి, వారి అభిమానాన్ని, ప్రేమని కొందరు ఎలా క్యాష్ చేసుకుంటారో లాంటి అంశాలు ఏవి ప్రస్తావించకుండా హీరో ని, ఫ్యాన్ ని బ్యాలెన్స్ చేస్తూ నిజాయితీగా ఒక ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది.
సినిమాలు చూస్తూ పడి కొట్టుకుని చచ్చే ఫాన్స్ ఉన్నట్లే, హీరో నుంచి స్ఫూర్తి పొంది జీవితాలను మలుచుకున్న వారున్నారు. అలాంటి వారి జీవితాలకి దగ్గరగా ఉంటుంది ఈ కథ. సినిమాటిక్ సీన్స్ కి పెద్ద పీఠ వేయలేదు దర్శకుడు. వాస్తవానికి దగ్గరగా ఉండేలా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. నిజమైన అభిమానం ఎలా ఉంటుందో ? తన ఫెవరెట్ హీరో కోసం ఒక ఫ్యాన్ ఎంత దూరం వేళ్తాడో ఈ సినిమాలో చూపించాడు. సాగర్ పాత్రలో చాలా మంది ఫాన్స్ తమని తాము చూసుకుంటారు. ఒక హీరో ని ఆదర్శముగా తీసుకుని తన లోపాన్ని అధిగమించి, జీవితాన్ని చక్కదిద్దుకుని, ఊరిని మార్చటం గొప్పగా ఉంటుంది. హీరోను వెతుక్కుంటూ ఫాన్స్ వెళ్ళటం కామన్ కానీ ఈ కథలో ఫ్యాన్ ని వెతుక్కుంటూ హీరో వెళ్ళటం, ప్రతి అడుగులో తన ఫ్యాన్ గురించి తెలుసుకునే విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఈ క్రమంలో హీరో ఫ్యాన్ కి అభిమానిగా మారటం ఆసక్తికరంగా సాగుతుంది. హీరో కథ కంటే ఫ్యాన్ కథ ఎక్కువ ఉంటుంది. కానీ కథ మొత్తం హీరోదే. కొత్త నేపథ్యం కావడంతో ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. హీరో హీరోయిన్లు లవ్ స్టోరీ, అడ్డంకులు అన్నీ కామన్ గా ఉన్నా వాటిని హీరో తో ఉన్న కనెక్షన్ తో ఎదుర్కోవటం వెరైటీ గా ఉంది. కమర్షియల్ హంగులు కోసం కాకుండా నార్మల్ గా కథ చెప్పటం మెచ్చుకోవాల్సిన విషయం. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ నుంచి కథనం స్పీడ్ అందుకుంది. ఈ సినిమాలో ఎమోషన్స్, ఆకట్టుకునే సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ సినిమాకి ప్లస్ గా నిలిచింది.
నటీ నటులు:
రామ్ నటనకి వంక పెట్టాల్సిన అవసరం లేదు. రామ్ లో నటుడు మరొకసారి ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. ఈ పాత్రకి సరిపోయే విధంగా సెటిల్డ్ గా చేసాడు. సాగర్ పాత్రకి రామ్ పెర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మాస్ యాక్షన్ గత కొన్నాళ్లుగా రామ్ ని చూసి విసిగిపోయిన ఫాన్స్ కి ఆంధ్రా కింగ్ తో మంచి ఫీస్ట్ ఇచ్చాడు. రామ్ లుక్ , బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా ఉన్నాయి. ఈ కథలో, సాగర్ పాత్ర లో ఉన్న లోతుని అర్థం చేసుకుని నటించాడు. స్టార్ హీరో సూర్య పాత్రలో ఉపేంద్ర కూడా చాలా బాగా చేసాడు. తెలుగులో ఇందరు హీరోలుండగా ఉపేంద్ర ని ఎందుకు తీసుకున్నారని అంతా అనుకున్నారు. కానీ మూవీ చూసాక ఉపేంద్ర బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతారు. ఉపేంద్ర చేయడం వల్ల సూర్య పాత్రకు హుందా తనం వచ్చింది. హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ బోర్సే కొంచెం నటనకి ఆస్కారమున్న రోల్ చేసింది. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్ లాంటి సినిమాల్లో నటించి కేవలం ‘గ్లామర్ డాల్’ ఇమేజ్ మాత్రమే తెచ్చుకుంది. రీసెంట్ గా కాంతా మూవీలో నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న భాగ్యశ్రీ ఆంధ్రా కింగ్ తాలూకా తో ఇంకో హిట్ తన ఖాతాలో వేసుకుంది. రామ్ భాగ్యశ్రీ జోడీ చాలా బాగుంది. మొత్తానికి భాగ్యశ్రీ ఈ మూవీలో అందం, అభినయంతో ఆకట్టుకుంది. రావు రమేష్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, సత్య రాజీవ్ కనకాలతమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
టెక్నికల్ :
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాతో దర్శకుడు పి. మహేష్ మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ తరువాత మళ్ళీ ఆడియన్స్ ని మెప్పించ గలిగాడు. డేంజర్ లో ఉన్న రామ్ కి బిగ్గెస్ట్ హిట్ అందించాడు. ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా ఏం రాసుకున్నాడో, అదే తీసాడు. వివేక్-మెర్విన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. టెక్నీకల్ టీమ్ పడ్డ కష్టం స్క్రీన్ పై కనిపిస్తోంది. ఈ మూవీకి టెక్నీకల్ టీమ్ చాలా ప్లస్ అని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కథకి ప్రాణం పోశారు వివేక్-మెర్విన్. సిద్దార్థ్ నూని సినిమాటో గ్రఫీ బాగుంది. చాలా కలర్ ఫుల్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
రామ్, ఉపేంద్ర, రావు రమేష్ నటన
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
పాటలు
టెక్నికల్ టీమ్
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
ల్యాగ్ సీన్స్
లవ్ స్టోరీ
ఫైనల్ వర్దిక్ట్ : ఫ్యాన్ ఫెస్టివల్ ” ఆంధ్రా కింగ్ తాలూకా “





