తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఐబొమ్మ (IBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (Ravi)కి భారీ షాక్ తగిలింది. అతడిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.
గత వారం రోజులుగా రవిని కస్టడీకి ఇవ్వాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ పెట్టగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీని మంజూరు చేశారు.
కొత్తగా విడుదలైన సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించిన ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని ఎట్టకేలకు సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, ఐ రాధ టీవీ పేర్లతో అనేక వెబ్సైట్లను రూపొందించి గత ఏడు సంవత్సరాలుగా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లను అక్రమంగా అప్లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
శనివారం కూకట్‌పల్లిలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, రవి నివసిస్తున్న అపార్ట్మెంట్లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని బషీర్‌బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)కు తరలించి కీలక సమాచారాన్ని సేకరించారు.
ఈ నేపథ్యంలో రవిని ఇవాళ నాంపల్లి కోర్టులో మరోసారి హాజరుపరచగా, కోర్టు అతడిని పోలీసు కస్టడీకి పంపింది.





