HomeTeluguWhatsApp లోనే మీసేవా సర్టిఫికెట్లు.. తెలంగాణలో కొత్త డిజిటల్ సర్వీస్

WhatsApp లోనే మీసేవా సర్టిఫికెట్లు.. తెలంగాణలో కొత్త డిజిటల్ సర్వీస్

తెలంగాణలో డిజిటల్ సేవలను మరింత సులభతరం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌ ద్వారా మీసేవ సర్టిఫికెట్ల అందుబాటును ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కొత్త సర్వీస్‌ను లాంచ్ చేశారు. మెటా–మీ సేవ భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ సేవ ద్వారా ఇకపై ప్రజలు మీసేవ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే 580కి పైగా ప్రభుత్వ సేవలను పొందవచ్చు.

ఈ సర్వీస్‌లో 38 శాఖలకు చెందిన కీలక సేవలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్లు, జనన-మరణ ధృవీకరణ పత్రాలు, అలాగే కరెంట్, వాటర్ బిల్లు చెల్లింపులు కూడా వాట్సాప్‌ ద్వారానే పూర్తి చేసుకోవచ్చు. ప్రక్రియ సులభంగా ఉండటం ఈ సర్వీస్ ప్రత్యేకత.

సేవను ఉపయోగించుకునే విధానం:

మీ ఫోన్‌లో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.

వాట్సాప్‌లో “Hi” లేదా “Menu” అని పంపాలి.

అందుబాటులో ఉన్న సేవల లిస్ట్ కనిపిస్తుంది.

కావాల్సిన సేవను ఎంచుకుని, ఆధార్ ఆధారిత ధృవీకరణ చేయాలి.

దరఖాస్తును పూర్తిగా పూరించి సమర్పించాలి.

మీ సేవ సెంటర్‌లో చేసిన దరఖాస్తులకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లు కూడా వాట్సాప్‌లోనే చూడొచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే సంబంధిత సర్టిఫికేట్‌ను వాట్సాప్‌ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ కొత్త వాట్సాప్ మీసేవ సర్వీస్ ప్రజలకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తెచ్చేలా సహకరిస్తుందని అధికారులు వెల్లడించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular