HomePolitics Teluguఅడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం క్షమాపణ.. కాంగ్రెస్‌లో ముగిసిన వివాదం..!

అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం క్షమాపణ.. కాంగ్రెస్‌లో ముగిసిన వివాదం..!

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ‘దున్నపోతు’ వ్యాఖ్యల వివాదం చివరికి ముగిసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన ఈ వివాదం పైసీ సీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యంతో సద్దుమణిగింది. ఈ రోజు ఆయన నివాసంలో ఇరువురు మంత్రులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి, వారిని చర్చలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, “అడ్లూరిని ఉద్దేశించి నేను ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. మీడియాలో వస్తున్న వార్తలు తప్పు. అలాంటి ఆలోచన నా మనసులో లేదు. మేమంతా కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గం వారితో కలిసి పెరిగాం. ఆయనకు ఈ వ్యాఖ్యలపై బాధ కలిగితే అందుకు క్షమాపణ కోరుతున్నాను” అని తెలిపారు.

గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. అయితే అడ్లూరి కొంత ఆలస్యంగా రాగానే, “జీవితం, సమయం గురించి మనకు తెలుసు.. ఆ దున్నపోతుకు ఏం తెలుసు?” అనే వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్య అడ్లూరి లక్ష్మణ్‌పై చేసినవని వార్తలు రావడంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అడ్లూరి కూడా తీవ్రంగా స్పందిస్తూ, “నేను దళితుడినని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పొన్నం ఈ వ్యాఖ్యలు తాను అడ్లూరిని ఉద్దేశించి చెప్పలేదని, ఢిల్లీ టికెట్లు ఆలస్యమవుతుండడంతో తన సహాయకుడిపై ఆ మాట అన్నానని స్పష్టం చేశారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular