HomeTeluguOG మూవీ రివ్యూ & రేటింగ్‌

OG మూవీ రివ్యూ & రేటింగ్‌

చిత్రం: OG
దర్శకత్వం: సుజిత్
కథ – రచన: సుజిత్

నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మీ,రాహుల్ రవీంద్రన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్, అభిమన్యు సింగ్ తదితరులు

నిర్మాత: డీవీవీ దానయ్య
సంగీతం: ఎస్. ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ : రవి కే చంద్రన్
ఎడిటర్: నవీన్ నూలీ

బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 25 సెప్టెంబర్ 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే సామాన్యులతో పాటు సెలబ్రిటీస్ కూడా ఆతృతగా వెయిట్ చేస్తారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా OG మానియా నడుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించారు. OG పై భారీ అంచనాలున్నాయి. OG ప్రీరిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా OG నిలిచింది. మ‌రి OG అంచనాలను అందుకుందో లేదో, పవన్ ఫాన్స్ ని సుజిత్ ఎంతవరకు మెప్పించాడో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

1980లలో సత్య దాదా (ప్రకాష్ రాజు) బొంబాయిలో తన ఇద్దరు కొడుకులు (శ్యామ్, వెంకట్) తో కలిసి ఒక పోర్టు నడుపుతూ ఉంటాడు. ఆ పోర్టుకి ఆర్‌.డీ.ఎక్స్‌తో నిండిన ఓ కంటైన‌ర్ వ‌స్తుంది. అది ఓమి (ఇమ్రాన్ హష్మీ) అనే ఓ గ్యాంగ్ స్టర్‌ది. ఆ కంటెన‌ర్‌ని స‌త్య‌దాదా దాచేస్తాడు. దాంతో ఒమీ మ‌నుషులు సత్యదాదా కొడుకుని చంపిస్తాడు. సత్య దాదా పెంపుడు కొడుకు ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) భార్య కన్మణి (ప్రియాంక మోహన్‌), కూతురు తారతో నాసిక్‌లో అజ్ఞాతంగా గడుపుతుంటాడు. ప‌దిహేనేళ్ల త‌ర‌వాత త‌న పెంపుడు తండ్రిని, ఆ కుటుంబాన్ని కాపాడ‌డం కోసం ఓజీ మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడు. అసలు సత్య దాదా కుటుంబానికి ఓజస్ గంభీర ఎందుకు దూరమయ్యాడు? ఓజ‌స్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓజీకి జపాన్ సమురాయ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? క్రూరమైన ఓమీ ని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి OG ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పొచ్చు. ఫాన్స్ కి దసరా సంబరాలు ముందే మొదలయ్యాయ‌ని అనుకోవొచ్చు. దర్శకుడు సుజిత్ కూడా పవన్ ఫ్యాన్ కావటం బాగా క‌లిసొచ్చాయి. ప్ర‌తీ సీన్‌లోనూ ప‌వ‌న్ ఎలివేష‌న్లు ఓ రేంజ్ లో తీర్చిదిద్దాడు. ఉన్నాయి. సినిమా మొత్తం ఫ్యాన్ బాయ్ మూమెంట్ మార్చేశాడు సుజిత్‌. పవన్‌ లుక్ చాలా స్టైలీష్ గా ఉంది. వింటేజ్ లుక్ లో పవన్ అలరించారు. సుజిత్ క్రియేట్ చేసిన ఎలివేషన్స్ కి తమన్‌ బీజీఎమ్ కూడా కలిసొచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఒక సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఇంకొంచెం కథ ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. పవన్ ఫ్యాన్ గా సుజీత్‌ డ్రామా కంటే మిగతా అంశాలపైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కథ మొదలు పెట్టటమే హీరో క్యారెక్ట‌ర్‌ని హైలెట్ చేస్తూ సాగింది. జపాన్‌లోని యకుజా, సమురాయ్ వంశాల మధ్య కథతో ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా మొదలవుతుంది. కథ ముంబైకి షిఫ్ట్ అయిన తరువాత పవన్‌కల్యాణ్‌ ఇంటర్ డక్షన్ సీన్ స్టార్ట్ అవుతుంది. పవన్ ఎంట్రీ నుంచి చివరి వరకు ఎలివేషన్ సీన్స్ కి లెక్కేలేదు. ఓజీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో రక్తపాతం ఎక్కువయ్యింది. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంగ్ అదిరింది. తర్వాత వచ్చే సీన్స్ కూడా సినిమాకే హైలెట్ గా నిలిచాయి. కానీ సైడ్ ట్రాక్ లతో కథ కొంచెం కన్ఫ్యూజన్ గా మారింది. ఒకే కథలో చాలా కోణాలు చెప్పాలనుకున్నాడు సుజీత్. అందువల్ల ఫ్లో దెబ్బతింది. OG లో లవ్ స్టోరీ తో పాటు, తండ్రీకొడుకుల అనుబంధం స్ట్రాంగ్ గా చూపించాలనుకున్నాడు. కానీ ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. పవన్ ఫాన్స్ కి కావల్సిన కంటెంట్ మాత్రం ఎక్కడా మిస్ అవలేదు. పవన్‌ స్టైలిష్‌ లుక్, యాక్షన్ సీన్స్ ఫాన్స్ ని అలరిస్తాయి. ఓజీ ముంబైకి తిరిగి వచ్చి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అభిమన్యు సింగ్ ను బెదిరించే సీన్ సినిమాకు హైలెట్‌ అని చెప్పొచ్చు. ఓమీ, ఓజీ మధ్య సీన్స్, అర్జున్ దాస్, ఓజీల మధ్య ఛేజింగ్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. వాషి ఓ వాషితో క్లైమాక్స్‌ ఫినిషింగ్ బాగుంది. రెగ్యుల‌ర్ క‌థే అనిపించినా జపాన్‌లో సమురాయ్ పాయింట్ కొత్తదనం తీసుకొచ్చింది.

నటీ నటులు:

OG మూవీ వన్ మాన్ షో అని చెప్పొచ్చు. సినిమా మొత్తం పవన్ కోసమే అన్నట్టు ఉంది. దర్శకుడు చెప్పిందల్లా పవన్ చేస్తూ వెళ్లారు. పవన్ స్వాగ్, స్టయిల్, ఫైట్స్ అన్నీ ఫ్యాన్ మూమెంట్స్ అని చెప్పాలి. లుక్ కూడా కొత్తగా ఉంది. ప్రియాంక మోహన్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉన్నా తన నటనతో అలరించింది. పవన్ కి మంచి జోడీ గా పేరు తెచ్చుకుంది ప్రియాంక. శ్రీయారెడ్డి నటన కూడా బాగుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓమీ పాత్రలో డిఫరెంట్ గా ఉన్నాడు. పవర్ ఫుల్ విలన్‌ గా అలరించాడు. పవన్ తో తలపడే సీన్స్ లో ఇమ్రాన్ ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, పాత్రలు కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. ఓజీ లో ప్రతీ పాత్రకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు సుజిత్.

టెక్నికల్ :

OG కి ప్రధాన బలం టెక్నికల్ టీమ్ అని చెప్పొచ్చు. ఓజీ మూవీకి టెక్నికల్ టీమ్ చేసిన కృషి తెరపై కనిపిస్తోంది. ప్రతీ సీన్ హైలెట్ అవటానికి టెక్నికల్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసారు. తమన్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ OG ని మరింత హైలెట్ చేసింది. ఓజీ ట్రాక్ ఎలివేష‌న్స్‌కి బాగా హెల్ప్ అయ్యింది. రవి కె.చంద్రన్‌, మనోజ్ పరమహంస విజువల్స్ సినిమాకి మరింత ఆకర్షణ తెచ్చిపెట్టాయి. ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ వర్క్ కూడా బాగా కుదిరాయి. 80లలో జరిగిన కథగా చూపించేందుకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. మొత్తానికి మరొకసారి సుజీత్ తన స్టైలిష్ మేకింగ్ తో ఫాన్స్ ని అలరించాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

పవన్‌కల్యాణ్‌
హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్
తమన్ మ్యూజిక్
టెక్నికల్ టీమ్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ స్లో నెరేషన్
ల‌వ్ ట్రాక్‌

You May Like This
- Advertisment -spot_img

Most Popular