తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
1953లో జన్మించిన జీవీ నారాయణ రావు 1976లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’ సినిమాతో నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకున్న ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు లభించింది.
మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందిన జీవీ నారాయణ రావు.. సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు బ్యాచ్‌మేట్‌గా ఉన్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితోనూ ఆయనకు సన్నిహిత స్నేహబంధం కొనసాగింది.
సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా కూడా జీవీ నారాయణ రావు తనదైన ముద్ర వేశారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’, ‘దేవాంతకుడు’ వంటి చిత్రాలను నిర్మించారు. తన సుదీర్ఘ కెరీర్లో 100కు పైగా సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు.
జీవీ నారాయణ రావు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.





