హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరై అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగెటివిటీ, అనవసర వివాదాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాలు, నెగెటివ్ కామెంట్లను పట్టించుకోవద్దని అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. ‘మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వదిలేయండి. కానీ పదేపదే ట్రోల్ చేయడం, ద్వేషాన్ని పెంచుకోవడం మంచిది కాదు’ అని ఆయన అన్నారు.
అభిమానులు తమ సమయం, శక్తిని సోషల్ మీడియా గొడవల కోసం వృథా చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. ‘మీ సమయం, మీ కష్టం ఎంతో విలువైనవి. వాటిని మీ వ్యక్తిగత ఎదుగుదల, కుటుంబ శ్రేయస్సు కోసం వినియోగించండి. అనవసరమైన ఆన్లైన్ వాదనలు, ట్రోలింగ్‌లకు దూరంగా ఉండండి’ అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఇచ్చిన సందేశాన్ని వారు హర్షాతిరేకాలతో స్వాగతించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల మధ్య విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.





