ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు.
1953 జనవరి 22న తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామంలో జన్మించిన ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితాన్ని జనతా పార్టీతో ప్రారంభించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి మరోసారి విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా సేవలందించారు.
తర్వాత టీడీపీకి రాజీనామా చేసి ప్రజా రక్షణ సమితి పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. 1995 నుంచి 1999 వరకు భారతీయ జనతా పార్టీలో పనిచేసిన ఆయన, 1999 నుంచి 2004 వరకు లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2024 మార్చి 15న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడిగా ముద్రగడ ప్రత్యేక గుర్తింపు పొందారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా 2016లో తుని ఘటన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారి రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది.
కాపు హక్కుల కోసం మాత్రమే కాకుండా, పుష్కర–పోలవరం కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలపై కూడా ఆయన పోరాటం చేశారు. రైతుల డిమాండ్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రజల దృష్టిని ఆకర్షించారు.
2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. దశాబ్దాల పాటు సామాజిక, రాజకీయ రంగాల్లో చురుకుగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శకానికి ముగింపు పలికినట్టుగా పలువురు నేతలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.





