కోలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకుడు..హీరో కాంబినేషన్లలో ధనుష్ – వెట్రిమారన్ జోడీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ఐదో చిత్రానికి ‘తమిళ మురుగన్’ (Thamizh Murugan) అనే టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్లో ధనుష్ భారీ ఏనుగుపై కూర్చొని, చేతిలో ‘వేల్’ ఆయుధాన్ని పట్టుకుని, వెనుక భారీ సైన్యంతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. మేకర్స్ ఈ పోస్టర్‌ను #SonOfKottravai హ్యాష్‌ట్యాగ్‌తో విడుదల చేశారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తమిళ సంస్కృతి, చరిత్రకు సంబంధించిన అంశాల నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో మురుగన్ పాత్రను ధైర్యవంతుడైన యోధుడు, ప్రజల రక్షకుడు, గొప్ప నాయకుడిగా ఆవిష్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు.
గతంలో ధనుష్ – వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన పొల్లాదవన్, ఆడుకాలం, వడ చెన్నై, అసురన్ వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘అసురన్’ చిత్రానికి ధనుష్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.





