చిత్రం: డెకాయిట్
దర్శకత్వం: షానియల్ డియో
కథ – రచన: అడివి శేష్
నటీనటులు: అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాష్ రాజ్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి, వైభవ్, తదితరులు
నిర్మాతలు: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
బ్యానర్: అన్నపూర్ణా సినిమాస్
విడుదల తేదీ: 10 ఏప్రిల్ 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2.75/5
హిట్ 2 తరవాత నాలుగేళ్లకు డెకాయిట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అడవి శేష్. హీరోగా వరస హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేషు మేజర్ మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా కూడా ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. క్షణం , ఎవరు, హిట్ 2, గూడాచారి, లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన శేషు డెకాయిట్ పై ఆడియన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. ఎట్టకేలకి ఈ సినిమా శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మరి శేషు డెకాయిట్ తో హిట్ కొట్టాడా లేదా ? ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
హరిదాస్ (అడివి శేష్) ఓ హత్య కేసులో 13 ఏళ్లుగా జైలులో ఉంటాడు. జైలు నుంచి ఎలా అయినా బయట పడాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు కడప జైలు నుంచి హరిదాసు ని మారుస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడు. హరిదాసు తప్పించుకోవటానికి ఇషాద్ భాయ్ (అతుల్ కులకర్ణి) సాయం చేస్తాడు. హరి దుబాయ్ కి వెళ్లనుకుంటాడు. కానీ అందుకోసం కొంత డబ్బు కావాల్సి ఉంటుంది. అందుకే దొంగతనం చేయాలి అనుకుంటాడు. అంతే కాదు 13 ఏళ్లుగా తాను ఖైదీ గా బతకడానికి కారణం అయిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) పై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. సరస్వతి కోసం వెళ్తే భర్త కూతురితో కనిపిస్తుంది. సరస్వతి భర్త భాస్కర్ (వైభవ్) తీవ్ర అనారోగ్యంతో మంచాన పడతాడు. భర్త ప్రాణాలు కాపాడటానికి సరస్వతికి కోటి రూపాయలు కావాల్సి ఉంటుంది. దాన్ని అవకాశంగా తీసుకుని హరి సరస్వతిపై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అందుకే సరస్వతిని తన క్రైమ్ పాట్నర్ గా చేసుకుంటాడు. అసలు హరి, సరస్వతి విడిపోవడానికి కారణం ఏంటి ? మళ్ళీ హరి వచ్చాక సరస్వతి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి ? హరిదాసు పై సరస్వతి ఎందుకు మర్డర్ కేసు పెట్టింది. సరస్వతి భర్త పాత్ర ఏంటి? సీఐ స్వామి అలియాస్ రాంబాబు (అనురాగ్ కశ్యప్), కరుణ హాస్పిటల్స్ ఛైర్మన్ (ప్రకాశ్ రాజ్), మల్లి (కామాక్షి భాస్కర్ల) పాత్రలు గూర్చి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
అడవి శేష్ సినిమా అంటే ఎదో కొత్తదనం ఉంటుంది. కథనం ఉత్కంఠ గా ఉంటుంది అని ఆడియన్స్ నమ్మకం. రచయితగా, దర్శకుడిగా శేష్ కి తనకి ఎలాంటి కథలు నప్పుతాయో, ఆడియన్స్ కి ఎలాంటి కథలు నచ్చుతాయో తెలిసిన వ్యక్తి. అందుకే అదే ఫార్ములాని ఫాలో అవుతూ పగ, ప్రతీకారాల్ని లవ్ స్టోరీతో ముడిపెట్టాడు. క్రైమ్, ప్రేమ అనే రెండు డిఫరెంట్ జోనర్లు ఒకే కథకి ముడిపెట్టడం వలన కథకి కొత్తదనం వచ్చింది. అంతే కాదు ఈ రెండు విషయాల్ని దర్శకుడు చక్కగా బ్యాలెన్స్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఇంటర్డ్యూస్ చేసి వెంటనే హరిదాసు జైలు లో ఉండటం, అక్కడనుంచి పారిపోవటానికి చేసే ప్రయత్నాలు కథ పై ఆసక్తిని పెంచుతాయి. దుబాయ్ పారిపోవాలనుకున్న హరి డబ్బు కోసం దొంగతనం చేయాలనుకోవడం, దీనికోసం హాస్పటల్ ని సెలక్ట్ చేసుకోవటం విశేషం. జనరల్ గా దొంగతనానికి బ్యాంక్ లూటీ , ఎటిఎం లాంటివి ఎంచుకుంటారు కానీ హరి హాస్పటల్ ని సెలక్ట్ చేసుకోవటం రొటీన్ కి భిన్నం గా ఉంటుంది. ఈ నేపథ్యం లో కరోనా నాటి పరిస్థితులని కూడా చూపించారు. చివరికి పగ తీర్చుకోవాలనుకున్న తన మాజీ ప్రేయసి సరస్వతిని తానూ చేయబోయే దోపిడీలో పార్టనర్ గా చేసుకోవటం లాజికల్ గా వర్కౌట్ అయ్యింది. ఇంట్రవెల్ బ్యాంగ్ ఇంట్రస్ట్ గా ఉంది. సెకండాఫ్లో కంప్లీట్ లవ్ స్టోరీ చూపించారు. ట్విస్టులు కొత్తగా ఉన్నాయి. క్లైమాక్స్ ఓల్డ్ మూవీ స్టైల్ లో ఉన్నా ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం.
అనవసరం అన్న సీన్స్ లేకపోవటం, కనక్టవిటీ దెబ్బతినకుండా కొన్ని విషయాలు ముందే చెప్పి, అన్నిటికి జస్టిఫికేషన్స్ ఇవ్వటం బాగుంది. స్క్రీన్ ప్లే వలన కథ మరింత ఇంట్రస్ట్ గా మారింది. స్క్రిప్టు పక్కాగా రాసుకున్నట్టు, దాన్నీ అదేవిధంగా ఫాలో అయినట్టు సినిమా చూస్తే అర్థం అవుతోంది. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. మాలలో ఉన్న పోలీస్ ఆఫీసర్ గన్ను పట్టుకొను అనటం, కరోనా టైమ్ కథ చూపిస్తూ రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నట్టు చూపించడం. ఇలాంటి వాటిపై మరింత శ్రద్ద పెట్టి ఉంటె బాగుండేది. హరిని సరస్వతిని పట్టుకోవటానికి సీఐ స్వామి (అనురాగ్ కశ్యప్) రంగంలోకి దిగడం, తాను తప్పించుకుని సరస్వతిని పోలీసులకి చిక్కేలా చేయటానికి హరి చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్గా ఉంటాయి. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని మర్డర్ కేసులో ఎందుకు ఇరికించాల్సి వచ్చిందో కన్విన్సింగ్గా చెప్పారు. ఛేజింగ్ సీక్వెన్స్లన్నీ ఆడియన్స్ కి థ్రిల్ ఇస్తాయి. క్లైమాక్స్ ఫుల్ ఎమోషనల్ గా ఉంది. శ్రీకాంత్, రాశి నటించిన ‘ప్రేయసి రావే’ సినిమాని గుర్తు చేస్తుంది.
నటీ నటులు:
హరిదాస్ పాత్రలో అడివి శేష్ నటన ఆకట్టుకుంది. మదనపల్లి యాసలో శేష్ సంభాషణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో శేష్ నటన సూపర్ గా ఉంది. ఒక రకంగా శేష్ వన్ మాన్ షో చేసాడనిపిస్తుంది. సరస్వతి పాత్రలో మృణాల్ నటన అద్భుతంగా ఉంది. కళ్లతోనే భావోద్వేగాల్ని పలికించిన తీరు అద్భుతం. సీఐ స్వామిగా అనురాగ్ కశ్యప్ నటన మరొకసారి మెప్పిస్తుంది. అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ప్రకాశ్రాజ్, సునీల్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ :
టెక్నికల్ టీమ్ డెకాయిట్ కి ప్లస్ అని చెప్పాలి. కోదాటి పవన్ కళ్యాణ్ తన ఎడిటింగ్ తో సినిమాకి చాలా ప్లస్ అయ్యాడు. ఎడిటింగ్ వలన కథ పై మరింత ఆసక్తి పెరిగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కన్నెపెట్టరో పాట హైలెట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీ నటులు
టెక్నికల్
యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
మెప్పించని లవ్ స్టోరీ
ట్విస్ట్స్
లాజిక్స్
ఫైనల్ వర్దిక్ట్ : శేష్ మాస్ ప్రయత్నం ‘డెకాయిట్’





