చిత్రం: బైకర్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
కథ – రచన: అభిలాష్ రెడ్డి
నటీనటులు: శర్వానంద్, రాజశేఖర్, మాళవిక నాయర్, తులసి, బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: యువరాజ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
బ్యానర్: యూవీ క్రియేషన్స్
విడుదల తేదీ: 3 ఏప్రిల్ 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 3/5
గత కొన్నాళ్లుగా వరస అపజయాలు ఎదుర్కొంటున్న యువ హీరో శర్వానందు సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ తో హిట్ కొట్టాడు. ఇదే జోష్ తో మూడునెలల గ్యాప్ లో ‘బైకర్’ తో సందడి చేసేందుకు వచ్చాడు. బైకర్ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. కారణం రేసర్ కాన్సెప్ట్ కావటం , ట్రైలర్ , టీజర్ ఆకట్టుకోవటం , సీనియర్ హీరో రాజశేఖర్ బైకర్ లో శర్వా తండ్రిగా నటించటం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ప్రమోషన్స్ కూడా బైకర్ ని హైపు కి తీసుకెళ్లాయి. పైగా మొదటి నుంచి ఆడియన్స్ కి శర్వా నందు కథలపై ఆసక్తి, నమ్మకం ఉన్నాయి. కొత్త కథల్ని సెలెక్ట్ చేసుకుంటాడని, కచ్చితంగా ఎదో ఒక విషయం ఉంటుంది అని నమ్మి థియేటర్స్ కి వెళ్తుంటారు. ఈ వారం థియేటర్స్ లో రిలీజైన ‘బైకర్’ తో శర్వా మరో హిట్ కొట్టాడా ? ప్రేక్షుకుల నమ్మకాన్ని నిలబెట్టాడా లేదా అన్నది ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్) హైదరాబాద్ లో ఒక కార్టింగ్ జోన్ రన్ చేస్తూ భార్య అనన్య (మాళవిక నాయర్). కొడుకు ఇషాన్ తో కలిసి జీవిస్తుంటాడు. ఇంత సాదా సీదాగా జీవితాన్ని గడుపుతున్న విక్కీ గతంలో ఒక ఫేమస్ బైక్ రేసర్. కొన్ని అనుకోని కారణాల వలన రేసింగ్ కి దూరం అవుతాడు. విక్కీ రేసింగ్ కోచ్ అతడి తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) కావటం విశేషం. తండ్రి కొడుకుని నంబర్ వన్ రేసర్ గా చూడాలనుకుంటే విక్కీ మాత్రం రేసింగ్ దూరం అవుతాడు. చివరికి తండ్రి కోసం మళ్ళీ రేసర్ గా మారాల్సి వస్తుంది. అసలు విక్కీ ఎందుకు రేసింగ్ కి దూరం అయ్యాడు ? తాను వద్దనుకున్న రేసింగ్ కి మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది. విక్కీ తండ్రికి ఎదురైన పరిస్థితులేంటి ? లాంగ్ గ్యాప్ తరువాత రేసింగ్ లోకి వచ్చిన విక్కీ ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నాడు? చివరికి తండ్రి కల నెరవేర్చాడా అన్నది బైకర్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలు చాలా తక్కువనే చెప్పొచ్చు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి ప్రేక్షకులని కదిలించిన సినిమా అంటే అంతా టక్కున నాని నటించిన ‘జెర్సీ’ మూవీని గుర్తు చేసుకుంటారు. ఇలాంటి కథల్లో స్టోరీ కంటే స్క్రీన్ ప్లే కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కారణం కథలో ఊహకి అందని ట్విస్ట్స్ ఉండటం అరుదు. అందుకే సినిమాలో చెప్పే కథ కంటే స్పోర్ట్స్ కి సంబందించిన డ్రామా, భావోద్వేగాలు, ఆయా పాత్రల సంఘర్షణ కి పెద్దపీట వేస్తారు. నాని జెర్సీ మూవీలో క్రికెట్ అన్నది ప్రధానమైన కాన్సెప్ట్ అయినా ఎమోషన్స్ ని హైలెట్ చేస్తూ ఆడియన్స్ ని డీప్ గా ఇన్వాల్వ్ అయ్యేలా చేసాడు దర్శకుడు. బైకర్ లో కూడా ఇలాంటి పాయింట్ మీద ద్రుష్టి పెట్టి ఉంటె సినిమా భారీ విజయాన్ని అందుకుని ఉండేది. బైకర్ లో ఎన్ని ప్లస్ లున్నా ఎమోషన్స్ లేకపోవటం తో కొంచెం బైకు అదుపు తప్పింది. మోటోక్రాస్ రేసింగ్ అన్న నేపథ్యం సినిమాకి కొత్తదనాన్ని ఇచ్చింది. రేసింగ్ సీన్స్ ఎలివేషన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. విజువల్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. కాకపోతే తండ్రి కొడుకు ఎమోషన్స్ చాలా పేలవంగా అనిపిస్తాయి. హీరో రేసింగ్ కి దూరం అవటానికి కారణాలు, మళ్లీ రేసింగ్ మొదలుపెట్టాడానికి తీసుకున్న నిర్ణయం ఈ సినిమాకి కీలకం. దర్శకుడు కావల్సినంత ఎమోషన్స్ పండించవచ్చు. కానీ కేవలం రేసింగ్ పై ఫోకస్ చేసి ఎమోషన్స్ ని నెగ్లెక్ట్ చేసాడు. అందుకే ఆడియన్స్ కి ఎదో వెలితి ఉండిపోయింది. పెద్దగా కనక్ట్ కాలేకపోయారనిపిస్తుంది. ధియేటర్ నుంచి బయటికి వచ్చిన ఆడియన్స్ లో కూడా ఎలాంటి ఎమోషన్స్ కనపడటం లేదు.
ఫస్ట్ హాఫ్ విక్కి ఫ్యామిలీ లైఫ్ తో మొదలై తర్వాత ఫ్లాష్‌బ్యాక్ రివీల్ చేస్తారు. సునీల్ నారాయణ్ పరిచయం, హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ, రేసింగ్, తండ్రీ, కొడుకుల అనుబంధం, మొదలైన విషయాలు తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. హీరో రేసింగ్ వదిలేయడానికి కారణాలు, తండ్రి కొడుకు మధ్య చెలరేగిన వివాదాలు, మలేషియా రేస్ ట్రాక్, జర్మనీలో జరిగే రేసింగ్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. తెలుగు తెరపై ఒక కంప్లీట్ రేసింగ్ డ్రామాగా బైకర్ పరవాలేదనిపించుకుంది. రేసింగ్ సీన్స్ ఆడియన్స్ ని థ్రిల్ కి గురిచేస్తాయి.
నటీ నటులు:
బైకర్ మూవీకి ప్రధాన బలం హీరో శర్వానంద్ అని చెప్పొచ్చు. రేసర్ గా శర్వా తనని తాను మలుచుకున్న తీరు అద్భుతం. నిజంగా ఓ స్పోర్ట్స్మెన్లా తన మేకోవర్ చేంజ్ చేసుకున్నాడు. అంతే కాదు రేసర్‌గా శర్వా నటన, హావభావాలు సహజ సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ లో శర్వా నట విశ్వరూపం చూపాడు. ఈ కథకి శర్వా నందు ని ఎంచుకోవటంతోనే దర్శకుడు సగం విజయం సాదించేసాడు. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా బుల్లెట్ సునీల్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఒక తండ్రిగా, ఓ కోచ్‌గా రాజశేకర్ నటన మెప్పించింది. బైకర్ మూవీ తరువాత రాజశేఖర్ కి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. హీరోయిన్ మాళవిక నాయర్ ఎప్పటిలా ప్రాధాన్యమున్న పాత్రలో మెరిసింది. శర్వానంద్ మాళవిక కెమిస్ట్రీ బాగుంది. అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, తులసి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ :
బైకర్ మూవీకి ప్రధాన బలం టెకక్నిల్ టీమ్ అని చెప్పొచ్చు. టెక్నికల్ టీమ్ పడ్డ కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తోంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బలం చేకూర్చింది. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. దర్శకుడు మోటోక్రాస్ రేస్‌ని అథెంటిక్‌గా తెరపై చూపించిన తీరు గొప్పగా ఉంది. మాటలు కొన్ని చోట్ల ఆకట్టుకునేలా ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
శర్వా నందు
టెక్నికల్ టీమ్
విజువల్స్
మైనస్ పాయింట్స్
ఎమోషన్స్ లేకపోవటం
ఫైనల్ వర్దిక్ట్ : ఎమోషన్స్ లేకపోయినా ఆకట్టుకునే ‘బైకర్’





