HomeMovie News Teluguపవన్ చేతుల మీదుగా బరి లాంచ్..

పవన్ చేతుల మీదుగా బరి లాంచ్..

మెగా కుటుంబం నుంచి నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్న నిహారిక కొణిదెల, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘బరి’ ప్రారంభమైంది. యదు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు (మార్చి 28) హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందజేసి, స్వయంగా క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘మా ఇంట్లో వాళ్లను ఫంక్షన్‌కి పిలవాలంటే నాకు కొంచెం మొహమాటం ఉంటుంది. కానీ నేను, నిహారిక కలిసి బాబాయ్ దగ్గరకు వెళ్లి ఈ మూవీ లాంచ్ గురించి చెప్పాము. ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి సమయం కేటాయించి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్‌తో సమయం గడిపి అందరిని ప్రోత్సహించారు. బాబాయ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని అన్నారు.

నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మా ‘బరి’ కూడా ఉండబోతోంది. షూటింగ్‌ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాం’ అని ఆమె తెలిపారు.

సంక్రాంతి సీజన్ మెగా హీరోలకు ఎప్పుడూ కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వంటి వారు ఈ సీజన్‌లో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో నిహారిక తన సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేయడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘బరి’ సినిమాతో నిహారిక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular