ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మలయాళ బ్యూటీ మమితా బైజు.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా, తాను నటించిన సినిమాల విజయాల్లోనూ భాగస్వామిగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తాజాగా మమితా బైజు నటించిన వరుస మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడంతో ఆమె పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మమితాను లక్కీ ఛార్మ్‌గా అభివర్ణిస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మమితా నటించిన చిత్రాల్లో ముందుగా దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ గురించి చెప్పుకోవాలి. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో మమితా కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఆ తర్వాత సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ లో మమితా బైజు కథానాయికగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని తక్కువ సమయంలోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది.
ఇక మలయాళ హీరో నివిన్ పౌలీతో కలిసి మమిత నటించిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గిరీష్ ఏ.డి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కేవలం 11 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరుకుంది.
ఇలా వరుసగా మూడు సినిమాలు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడంతో మమితా బైజు కెరీర్లో అరుదైన ఫీట్ నమోదైంది. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్‌గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మమితా బైజు సౌత్‌లో బిజీ హీరోయిన్గా మారుతూ.. మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.





