HomeMovie News Teluguకాలర్ ఎగరేయట్లేదు.. అఖిల్ సైలెంట్ స్టేట్‌మెంట్

కాలర్ ఎగరేయట్లేదు.. అఖిల్ సైలెంట్ స్టేట్‌మెంట్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ‘లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ కార్యక్రమంలో అఖిల్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

అఖిల్ మాట్లాడుతూ, ‘లెనిన్ నా కెరీర్‌లోనే అతిపెద్ద విజయం. ఈ విజయాన్ని అందించిన ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా హిట్ అయిందని నేను కాలర్ ఎగరేయడం లేదు.. గట్టిగా అరవడం లేదు. ఎప్పటిలాగే సైలెంట్‌గా నా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సినిమాలు అందించేందుకు మరింత కష్టపడతాను’ అని అన్నారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్టీఆర్ గారికి ఒక్క ఫోన్ చేయగానే మా సినిమా కోసం వాయిస్ ఓవర్ చెప్పేందుకు వెంటనే అంగీకరించారు. ఆయన వాయిస్‌తో సినిమా ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రేక్షకులను మొదటి నుంచే కథలోకి తీసుకెళ్లడంలో ఆయన వాయిస్ ఓవర్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా విజయంలో ఆయన సహకారం కూడా ఎంతో విలువైనది’ అని అఖిల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన వినయపూర్వక స్పందనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, లెనిన్ విజయోత్సాహం ఇంకా కొనసాగుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular