ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూశారు. హనుమకొండకు చెందిన నిరంజన్ కొంతకాలంగా అరుదైన న్యూరోమస్క్యులర్ (Neuromuscular) వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
నిరంజన్ మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
గత నెల జూన్ 17న పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్‌ను ఆప్యాయంగా పలకరించి ధైర్యం చెప్పారు. అలాగే నిరంజన్ గతంలో పవన్ పాటలకు చేసిన డాన్స్ వీడియోలను చూసి ఆయనను అభినందించారు.
ఆ సందర్భంగా నిరంజన్‌ను అభిమానులు ప్రేమగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ‘మనిద్దరం కలిసి ‘OG’ సినిమా చూద్దాం. ఒకవేళ ‘OG 2′ వస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్’ అంటూ ఆయనకు మాట ఇచ్చారు. అలాగే పలు బహుమతులతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందజేశారు.
అయితే ఆ ఆత్మీయ భేటీ జరిగిన కొద్ది రోజులకే నిరంజన్ మరణించడం పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయనతో పవన్ కళ్యాణ్ గడిపిన క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు నిరంజన్‌కు నివాళులు అర్పిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమాని చిన్నారి నిరంజన్ కన్నుమూత..
— Milagro Movies (@MilagroMovies) July 8, 2026
అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.
ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతని ఇంటికి వెళ్లి పరామర్శించి రూ.1 లక్ష సాయం అందించడమే కాకుండా.. "OG-2 కలిసి చూద్దాం" అని మాటిచ్చారు#Niranjan… pic.twitter.com/8LLD4oHYQ8





