స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై తొలిసారి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల నటుడు విజయ్ దేవరకొండతో ఆమె వివాహం జరిగిన కొద్దిరోజులకే, ఆమె తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన పాత ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది.

2016లో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ సినిమా సమయంలో రష్మిక మందన్న కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు. అనంతరం 2017లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే 2018లో ఆ నిశ్చితార్థం రద్దు కావడంతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలో ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆమె తల్లి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ వ్యక్తిగత సంభాషణను ఇప్పుడు బయటకు తీసుకువచ్చి వివాదం సృష్టించడంపై రష్మిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఎనిమిదేళ్లుగా మీడియాలోని కొందరు వ్యక్తులు, కొన్ని వర్గాలు నాపై అసత్య ప్రచారాలు చేస్తూ వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. నేను అనని మాటలను అన్నట్లుగా సృష్టించి వ్యూస్ కోసం ద్వేషాన్ని పెంచుతున్నారు. ఇంతకాలం నేను సహనంతో మౌనంగా ఉన్నాను. కానీ గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు అన్ని హద్దులు దాటాయి.

ఎనిమిదేళ్ల క్రితం నాటి ఒక ప్రైవేట్ సంభాషణను అనుమతి లేకుండా రికార్డ్ చేసి, అందులోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని ఇప్పుడు వివాదం సృష్టించారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. నన్ను విమర్శించడం మాత్రమే కాదు, ఇప్పుడు నా కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఒకరి గౌరవాన్ని దెబ్బతీస్తూ ద్వేషాన్ని వ్యాప్తి చేయడం చాలా బాధాకరం అని రష్మిక పేర్కొన్నారు.

ఈ ఆడియో క్లిప్‌ను లేదా దీనికి సంబంధించిన కథనాలను ప్రచారం చేస్తున్నవారు వెంటనే వాటిని తొలగించాలని రష్మిక హెచ్చరించారు. ఈ ప్రకటన వెలువడిన 24 గంటల్లోపు వాటిని తొలగించకపోతే, రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు మరియు సంస్థలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నా గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం రష్మిక చేసిన ఈ ప్రకటన సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బాధ్యతారాహిత్యంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి కూడా మద్దతు వ్యక్తమవుతోంది.





