HomeMovie News Telugu‘మై విలేజ్ షో’లో చీలిక.. అనిల్ జీలా ఔట్!

‘మై విలేజ్ షో’లో చీలిక.. అనిల్ జీలా ఔట్!

యూట్యూబ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అవుతున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంతో వీడియోలు రూపొందించి యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందడమే కాకుండా, కొంతమంది సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదిస్తున్నారు. అలా ఎంతో పాపులర్ అయిన యూట్యూబ్ ఛానళ్లలో ‘మై విలేజ్ షో’ కూడా ఒకటి.

తెలంగాణ యాస, సంస్కృతి ప్రతిబింబించేలా రూపొందించిన వీడియోలతో ‘మై విలేజ్ షో’ మంచి గుర్తింపు సంపాదించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లంబాడి పల్లె గ్రామానికి చెందిన యువకులు శ్రీకాంత్, అనిల్ జీలా, శివకృష్ణ కలిసి ఈ ఛానల్‌ను ప్రారంభించారు. 2012లో మొదలైన ఈ ఛానల్ 2018 తర్వాత పెద్ద ఎత్తున పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 3.14 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛానల్‌కు మంచి ఆదరణ ఉంది.

ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతున్న ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పుడు చీలిక వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ‘మై విలేజ్ షో’ నుంచి అనిల్ జీలా అధికారికంగా వైదొలిగినట్లు టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఇకపై అనిల్ జీలాకు తమ ఛానల్‌తో ఎలాంటి సంబంధం ఉండబోదని ‘మై విలేజ్ షో’ బృందం స్పష్టం చేసింది. ఇప్పటికే అనిల్ జీలా తన సొంత యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో ప్రమోషన్లు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ‘మై విలేజ్ షో’ టీమ్, అనిల్ జీలా మధ్య విభేదాలు ఏర్పడ్డాయని టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయన ఈ ఛానల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇకపై అనిల్ జీలా చేసే ప్రమోషన్లు లేదా వ్యాపారాలకు ‘మై విలేజ్ షో’కు ఎలాంటి సంబంధం లేదని టీమ్ స్పష్టంచేసింది. ‘మై విలేజ్ షో’ పేరుతో ఎవరైనా సంప్రదిస్తే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే సమాచారం తీసుకోవాలని, ఎవరినీ నమ్మి మోసపోవద్దని ప్రేక్షకులను కోరింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular