HomeMovie News Teluguతండ్రికి క్లీన్‌ చిట్‌.. మా నాన్న మంచోడు: ఐశ్వర్య

తండ్రికి క్లీన్‌ చిట్‌.. మా నాన్న మంచోడు: ఐశ్వర్య

తమిళ నటుడు అర్జున్‌పై ‘మీ..టూ..’ ఆరోపణలు చేసింది కన్నడ హీరోయిన్‌ శృతి హరిహరన్‌. అయితే ఆమె ఆరోపణలు బెడిసికొట్టేస్తున్నాయి. సీనియర్‌ నటుడైన అర్జున్‌, రెండు మూడు దశాబ్దాలుగా వెండితెరపై తనదైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. 

తెలుగులోనూ, తమిళంలోనూ అర్జున్‌ చాలా సినిమాల్లో నటించాడు. చాలామంది హీరోయిన్లతో పనిచేశాడు. అయితే అతని మీద ఎవరూ ఇప్పటిదాకా ఇలాంటి ఫిర్యాదులు చేయలేదు. తమిళ నటి ఖుష్బూ అయితే, అర్జున్‌కి క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ‘అర్జున్‌ మిస్టర్‌ క్లీన్‌. చాలా సందర్భాల్లో నన్ను కాపాడాడు. సెట్స్‌లో ఏ అమ్మాయికీ అన్యాయం జరగనివ్వడు. అతని మంచి మనసు కారణంగానే ఇంత ఎత్తుకు ఎదిగాడు’ అని చెప్పింది ఖుష్బూ. 

తాజాగా అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య కూడా తన తండ్రికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ‘నాన్న చాలామంది హీరోయిన్లతో పనిచేశారు. వాళ్ళలో చాలామంది నాకు తెలుసు. అందరూ నాన్న గురించి మంచిగా చెప్పినవారే. మా నాన్న మంచితనమే నాకు సినీ పరిశ్రమలో ఇంతటి గౌరవాన్ని తెచ్చింది. ఒకవేళ మా నాన్న ఏ హీరోయిన్‌తో అయినా అసభ్యకరంగా ప్రవర్తించి వుంటే, సినీ పరిశ్రమలోకి నన్ను రానిచ్చేవారు కాదేమో..’ అని ఐశ్వర్య అభిప్రాయపడింది. 

పలువురు తమిళ హీరోయిన్లూ అర్జున్‌కి మద్దతుగా గళం విప్పుతున్నారు. శృతి హరిహరన్‌ మాత్రం, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నానంటోంది. మరోపక్క శృతి హరిహరన్‌ ఆరోపణల్ని ఆమెతో పనిచేసిన దర్శకుడూ కొట్టి పారేస్తున్నాడు. ఆ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన సినిమా సమయంలోనే అర్జున్‌, ఆమెను వేధించాడనేది ప్రధాన ఆరోపణ.

You May Like This
- Advertisment -spot_img

Most Popular