HomeTeluguలెనిన్ మూవీ రివ్యూ & రేటింగ్

లెనిన్ మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: లెనిన్
దర్శకత్వం: ముర‌ళి కిషోర్ అబ్బూరి
కథ – రచన: ముర‌ళి కిషోర్ అబ్బూరి

నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సె, సునీల్, శివాజీ, బ్రహ్మాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరీ రావు, ప్రవీణ్ తదితరులు

నిర్మాతలు: అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ.

సంగీతం: త‌మ‌న్‌.ఎస్‌
సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో
ఎడిటర్: న‌వీన్ నూలి

బ్యానర్: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌.

విడుదల తేదీ: 10 జూలై 2026

అక్కినేని నట వారసుడు అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 11 ఏళ్ళు అయినా ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేకపోయాడు. అఖిల్ చివరిగా ‘ఏజెంట్’ చేసాడు. ఈ మూవీ ఆడియన్స్ ని నిరాశపరచటంతో లాంగ్ గ్యాప్ తరవాత ‘లెనిన్’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసేందుకు వచ్చాడు. లెనిన్ కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. వాయిదాలు పడుతూ పడుతూ చివరికి ఈ సినిమా జులై 10 న రిలీజ్ అయ్యింది. మరి లెనిన్ కథ ఏంటో? అఖిల్ ఈ మూవీతో తనని తానూ నిరూపించుకున్నాడా? అన్నది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

లెనిన్ కథ 2001లో కడప జైలు నుంచి మొదలవుతుంది. జైలు నుంచి విడుదలైన లెనిన్ (అఖిల్ అక్కినేని) తన సొంత ఊరు శ్రీరామాపురం వెళతాడు. ఈ క్రమంలో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అనాథగా ఆ ఊరు వచ్చిన ‘లెనిన్’ ని ఊరు పెద్ద (ఈశ్వరి బాయి) చేరదీస్తోంది. వాళ్ల ఇంట్లో వారి కుమారుడు వసంత్ (ప్రమోద్ పంజు)తో కలిసి పెరుగుతాడు. ఒకరోజు ఊరి తిరునాళ్లలో భారతి (భాగ్యశ్రీ బోర్సే) ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. తనతో పాటు పెరిగిన వసంత్ తో భారతి అక్కకు పెళ్లి కుదురుతుంది. కానీ పెళ్లి రోజు పెళ్లికూతురు కనిపించకుండా పోతుంది. ఈ క్రమంలో ఆమె చెల్లి భారతితో వసంత్ పెళ్లి చేయాలనుకుంటారు రెండు వైపుల కుటుంబ పెద్దలు. తాళి కట్టేటప్పుడు భారతి తాను లెనిన్‌ను ప్రేమిస్తున్నట్టు చెప్తుంది. తనతో సమానంగా తన తమ్ముడిలా పెరిగిన లెనిన్‌కు భారతిని ఇచ్చి పెళ్లి చేస్తాడు వసంత్. తరవాత వ‌సంత్ లెనిన్‌కు ఎలాంటి ద్రోహం చేసాడు? ప్రాణంగా ప్రేమించిన భారతి లెనిన్ కి ఎందుకు దూర‌మైంది? అసలు భారతికి ఎం జరిగింది ? ఆ సంఘటనతో లెనిన్ కి ఏంటి సంబంధం? జాత‌ర‌లో లెనిన్ ఎవ‌రిని హ‌త్య చేసి జైలు పాల‌య్యాడు? వసంత్ కుటుంబంపై య‌తిరాజు (శివాజీ) ప‌గ‌కి కార‌ణ‌మేమిటి? లెనిన్ కార‌ణంగా ఎమ్మెల్యే రాఘ‌వ‌రెడ్డి, దామోద‌ర కు (బ్ర‌హ్మాజీ) ఎలాంటి అవ‌మానాలు ఎదుర‌య్యాయి? లెనిన్ చివరకు తన భార్య భారతికి న్యాయం చేశాడా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే .

విశ్లేషణ:

ప్రజంట్ టాలీవుడ్‌లో మైథలాజికల్ కథల ట్రెండ్ నడుస్తోంది. అందుకనే కథకి అవసరమున్నా లేకపోయినా మైథలాజికల్ బ్యాక్ గ్రౌండ్ లో కథలు అల్లుకుంటున్నారు మన దర్శకులు . వీటితో పాటు తెలంగాణ, ఉత్తరాంధ్ర, సీమ, గోదావరి యాసలతో సినిమా కథలు రూపొందుకుంటున్నాయి. పుష్ప లాంటి కమర్షియల్ కథ చిత్తూరు భాషలో మెప్పించింది. మొన్నటికి మొన్న రామ్ చరణ్ పెద్ది తో ఉత్తరాంధ్ర భాషకి ప్రాణం పోసాడు. అదే కోవలో ఇప్పుడు అఖిల్ లెనిన్ చిత్తూరు యాస, భాష‌ల‌తో వచ్చాడు లెనిన్. మ‌హాభార‌తం క‌థని పోలి ఉండేలా ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు. భారతం లో ధ‌ర్మానికి ప్ర‌తీక‌గా ధర్మరాజు ఉన్నప్పటికీ చాలా కుట్ర‌లు, కుతంత్రాలు, నమ్మక ద్రోహాలు ఉంటాయి. ఇవే విషయాలని నేటి జనరేషన్ కి అర్థ‌మ‌య్యేలా ఓప్రేమ‌క‌థ ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ముర‌ళీకృష్ణ అబ్బూరి. మ‌హాభార‌తం రిఫ‌రెన్స్‌లు ఈ కథలో చాలా ఉన్నాయి.

హీరో క్యారెక్టర్‌ను పాండవులు, విలన్ క్యారెక్టర్‌ను కౌరవులు, హీరోయిన్ క్యారెక్టర్ ద్రౌపది పాత్రతో లింక్ చేస్తూ ఆధునిక మహాభారతాన్ని తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు . త‌న ఆప్తులు, బంధువుల‌తోనే యుద్ధం చేయాల్సివ‌చ్చిన‌ప్పుడు పాండ‌వులు ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను హీరో పాత్ర ద్వారా చూపించారు. అందుకే ఈ కథ మ‌హాభార‌తంలో జూదంలో పాండ‌వులు ఓడిన త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ ఇంటర్డక్షన్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ ఇంట్రెస్టింగ్‌గా మొద‌ల‌వుతుంది. మహాభారతాన్ని బ్యాక్ గ్రౌండ్ లో చెప్తూ ‘మిట్ట జాత‌ర‌’ ను లింక్ చేస్తూ ద‌ర్శ‌కుడు క‌థ‌లోకి తీసుకువెళ్లాడు. తరువాత హీరో, హీరోయిన్ల ప‌రిచ‌యం, లవ్ స్టోరీ, తో ఫ‌స్ట్ హాఫ్ సాగిపోతుంది. సెకండాఫ్ పూర్తిగా ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది కథ . విల‌న్ ఎవ‌ర‌న్న‌ది రివీల‌య్యే ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ర‌క్త‌పాతం ఎక్కువగా అనిపిస్తుంది. చివరి ట్విస్ట్ బాగుంది. చిత్తూరు యాస, భాష‌లు లెనిన్ కి ప్ల‌స్స‌య్యాయి. యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయి. జాత‌ర సీన్ కొంచెం పుష్ప‌2 ని గుర్తుకు తెస్తుంది. ఇంతవరకు క్లాసీ లవ్ స్టోరీలు చేసిన అఖిల్ మొదటిసారి ఒక మాస్ యాక్షన్ & ల‌వ్‌ స్టోరీతో మెప్పించాడు.

నటీనటులు:

అక్కినేని అఖిల్ తన 11 ఏళ్ళ సినీ ప్రయాణం లో లెనిన్ గా గుర్తుండిపోయే పాత్ర చేసాడనిపిస్తోంది. ఇప్పటి వరకు చాకోలెట్ బాయ్ ఇమేజ్ ఉన్న అఖిల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకోసం చిత్తూరు యాస, భాషలతో అద్భుత నటన కనపరిచాడు. అఖిల్ నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ధర్మరాజు తరహా పాత్రలో అఖిల్ మెప్పించాడు. హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రజెన్సీ, నటన బాగుంది. అఖిల్, భాగ్యశ్రీ జోడీ ఆకట్టుకుంటుంది. వసంత్ పాత్రలో నటించిన ప్రమోద్ పంజు చక్కటి నటనను కనబరిచాడు. లెనిన్ తరువాత ప్రమోద్ కి తెలుగులో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. హీరోతో సమానమైన పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు. కోర్టు, దండోరా తరువాత శివాజీకి నటనకి స్కోప్ ఉన్న పాత్ర పడింది. ఈ సినిమాతో శివాజీ తన మార్క్‌ నటన చూపెట్టాడు. బ్రహ్మాజీ పాత్ర భారతం లో శకుని రిఫరెన్స్ తో ఉంటుంది. ఈశ్వరి బాయ్ కూడా గాంధారి రిఫరెన్స్ పాత్రలో మెప్పించింది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్:

‘లెనిన్’ ద్వారా నేటి యువతకి ఆధునిక మ‌హాభార‌తాన్ని పరిచయం చేసాడు దర్శకుడు మురళి కృష్ణ అబ్బూరి. మహాభారతం రిఫ‌రెన్స్‌ లతో రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఒక లవ్ స్టోరీ చెప్పి మెప్పించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే, కథలో వచ్చే ట్విస్ట్ లు.బాగున్నాయి. త‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో బీజీఎమ్ గూస్‌బంప్స్ తెపిస్తుంది. లియాన్ బ్రిట్టో సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. జాత‌ర ఎపిసోడ్స్‌ను చాలా నాచుర‌ల్‌గా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. కొడుకు కోసం నాగార్జున కూడా నాగ‌వంశీతో క‌లిసి లెనిన్ మూవీని నిర్మించారు.

ప్లస్ పాయింట్స్

అఖిల్ నటన
బలమైన ఎమోషన్స్
టెక్నికల్ టీమ్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ లాగ్
ఎడిటింగ్
కథకి సంబంధం లేని టైటిల్

You May Like This
- Advertisment -spot_img

Most Popular