టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావంతో మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 70 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లలో తన ఎనర్జీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, చిత్రంలోని కీలక యాక్షన్ ఎపిసోడ్‌ను భారీ వర్షం మధ్య చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశం కోసం చిరంజీవి గంటల తరబడి వర్షంలో తడుస్తూనే షూటింగ్‌లో పాల్గొన్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌ను ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేయడానికి ఆయన చూపిన నిబద్ధతపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, ఇప్పటికీ ప్రతి సన్నివేశానికి పూర్తి స్థాయిలో కష్టపడుతున్న చిరంజీవి అంకితభావం యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తోందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన వివరాలపై చిత్రబృందం నుంచి పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ‘మెగా 158’ పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.





