తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘ఖైదీ’ తో ప్రారంభమైన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) తర్వాత వచ్చిన ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలతో మరింత విస్తరించింది. ముఖ్యంగా ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఇటీవల విడుదలైన ‘కూలీ’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయినా, లోకేష్ తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ ఆసక్తి కొనసాగుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా LCUలో భాగమా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం LCUలో భాగంగా కాకుండా పూర్తిగా కొత్త కథతో రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ మరోసారి తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తైన అనంతరం లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.





