మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఇరుముడి’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా చిత్రబృందం ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. విడుదలైన గ్లింప్స్‌లో తండ్రీ – కూతురు మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని ఎంతో హృద్యంగా చూపించారు.
సుమారు 1 నిమిషం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌లో రవితేజ తన కూతురితో ఆనందంగా గడిపే క్షణాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కథలో కీలక మలుపును సూచించే సన్నివేశాలను కూడా చూపించారు. తన కూతురు కోరడంతో రవితేజ పాత్ర జీవితంలో మార్పు చోటుచేసుకుని, అయ్యప్ప స్వామి భక్తుడిగా మారే ప్రయాణాన్ని గ్లింప్స్‌లో ఆసక్తికరంగా చూపించారు. ఇక జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత బలం చేకూర్చింది. హృదయాలను హత్తుకునే సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గ్లింప్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, ఆధ్యాత్మిక అంశాలను కలిపి రూపొందించిన ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





