HomeMovie News Teluguఆ ఒక్కటీ అడగొద్దనంటోన్న నయనతార

ఆ ఒక్కటీ అడగొద్దనంటోన్న నయనతార

రెమ్యునరేషన్‌ తగ్గించుకోవడమనే అంశం గురించి తనను అడగొద్దని అందాల భామ నయనతార స్పష్టంగా చెప్పేస్తోంది. సినీ రంగంలో పదేళ్ళకు పైగా కెరీర్‌ నయనతార సొంతం. సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌గా నయనతారకి గుర్తింపు ఉంది. ఆమె ఎంచుకుంటోన్న సినిమాలు, అవి సాధిస్తున్న విజయాలు ఆమె ఇమేజ్‌ని రోజురోజుకీ పెంచేస్తున్నాయి. కొన్ని సినిమాలు ఫెయిల్‌ అయినా, నయనతార సినిమాలకుండే క్రేజ్‌ కారణంగా నిర్మాతలు ఆమెకు భారీ రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. 

ఒక్కోసారి సినిమా బడ్జెట్‌తో సమానంగా నయనతార రెమ్యునరేషన్‌ ఉంటోంది. నయనతార నటించే సినిమాల్లో హీరో కంటే కూడా ఆమె రెమ్యునరేషన్‌ ఎక్కువగా ఉండటం పట్ల కొందరు హీరోలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, తద్వారా వివాదాలు తలెత్తడం కూడా చూస్తున్నాం. అందుకే కథల ఎంపికలో నయనతార చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కథ ఒక్కటే కాదు, సినిమాలో హీరో దగ్గర్నుంచి, దర్శకుడు – నిర్మాత తనను డీల్‌ చేయబోయే విధానం గురించి కథ విన్నప్పుడే పూర్తిగా అధ్యయనం చేసేసి, ఆ తర్వాతే ఆ సినిమాకి ఓకే చెబుతోంది నయనతార. గ్లామర్‌ దగ్గర్నుంచి, ప్రమోషన్‌ వరకూ అన్ని విషయాల మీదా దర్శక నిర్మాతలకి ముందే క్లారిటీ ఇచ్చేస్తూ, నయనతార ఆ విషయంలో తనపై విమర్శలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తోంది. 

కొన్ని సినిమాల పబ్లిసిటీకి రాకపోవడం పట్ల వివాదాలు తలెత్తడంపైనా నయనతార తాజాగా స్పందించింది. అన్ని విషయాలూ ముందే దర్శక నిర్మాతలతో మాట్లాడతాననీ, వారు ఒప్పుకుంటేనే ఆ సినిమా చేస్తాననీ ఆ తర్వాత తనను వారెవరూ ప్రశ్నించబోరనీ, ఈ విషయంలో ఇతరులు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసేసింది నయనతార. గ్లామర్‌తో అవకాశాల కోసం పాకులాడే స్టేజ్‌లో తాను లేనని చెబుతూ, తన నటనను ప్రేక్షకులు కోరుకుంటున్నారనీ, అలాంటప్పుడు ఎక్స్‌పోజింగ్‌తో పనేంటని ఈ బ్యూటీ క్లాస్‌ తీసుకుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular